News

సూపర్ ఫిట్‌మెంట్43శాతం


ఉద్యమంలో కధంతొక్కిన ఉద్యోగులకు కడుపునిండాలే జీతాలు పెంచారు టీ-ముఖ్యమంత్రి కేసీఆర్. కడుపునిండా పీఆర్సీని ప్రకటించారు. ఇటీవల జరిగిన టీఎన్జీవోల డైరీ ఆవిష్కరణ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యోగులకు కడుపు నిండా పీఆర్‌సీని ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే ఉద్యోగులు, ఉపాధ్యాయులను సంతోషపర్చేలా 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించారు. నగదు ప్రయోజనం తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్2వ తేదీ నుంచి అమలు కానుంది. తాజా పెంపుతో ప్రభుత్వంపై.. ఏటా రూ.6,500 కోట్లకు పైగా అదనపు భారం ఉండనుంది.ఈ నిర్ణయానికి ముందు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చకచక చోటు చేసుకొన్నాయి. శాసనమండలి సభ్యుల ఎన్నికల నిబంధనావళి అమల్లోకి వస్తే.. పీఆర్ సీ ప్రకటించడం కష్టమని ఉద్యోగ సంఘ నేతలు ముఖ్యమంత్రిని కలసి విజ్ఝప్తి చేశారు. దీంతో.. రంగంలోకి దిగిన కేసీఆర్.. పీఆర్ సీని ప్రకటించేందుకు పరిస్థితులను చకచక చక్కదిద్దారు. ఆర్థిక శాఖ అధికారులు నాగిరెడ్డి, రామకృష్టారావు, శివశంకర్‌లతోనూ, ఉద్యోగుల విజ్ఞప్తులను తెలుసుకొనేందుకు ఏర్పాటైన ఉన్నత స్థాయి సంఘం ఛైర్మన్ ప్రదీప్ చంద్రతోనూ సీఎం విస్తృతంగా చర్చించారు.ఉద్యోగుల నేతలు 69 శాతం ఫిట్ మెంట్ ను ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఫిట్‌మెంట్‌ను 37-38 శాతానికి మించి ఇవ్వటం కష్టమని ఆర్థిక శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో.. సీఎం కేసీఆర్ జోక్యం చేసుకొని 43శాతం పీఆర్ సీ ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, కేసీఆర్ తాజా నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై మరింత బాధ్యతతో పని చేస్తామని ఉత్సాహంగా చెబుతున్నారు.